పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్ జిల్లాలో ఆదివారం ఉదయం రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు లోకో పైలట్‌లు గాయపడ్డారు. రెండు రైళ్లు అంబాలా వైపు నుంచి వచ్చి సిర్హింద్‌లోని మాధోపూర్ సమీపంలో ఢీకొన్నాయని అధికారులు తెలిపారు. లోకో పైలట్‌లను తొలుత ఫతేఘర్ సాహిబ్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని రాజింద్ర ఆసుపత్రికి తరలించారు.
సిర్హింద్ రైల్వే పోలీస్ స్టేషన్‌కు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్.హెచ్.ఓ. రత్తన్ లాల్ మాట్లాడుతూ… ప్రమాదం గురించి తెల్లవారుజామున 4 గంటలకు తమకు సమాచారం అందిందని, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అంబాలా-సిర్హింద్ రైల్వే ట్రాక్ అత్యంత రద్దీగా ఉండే రైల్వే ట్రాక్‌లలో ఒకటి. దీని మీద వందలాది రైళ్లు ప్రయాణిస్తాయి. రైళ్లు ఒకే ట్రాక్‌పై నడుస్తున్నాయా లేదా ప్రమాదానికి దారితీసిన మరేదైనా లోపం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

