సామర్లకోట తాపీ పనివారాల సంఘం అధ్యక్షులు దూదింపూడి రాజు ఇటీవలే అనారోగ్యం కారణంగా మృతి చెందారు. ఏ.పీ. బిల్డింగ్ & కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ది రెడ్ల సత్యనారాయణ, తదితరులు కలిసి సామర్లకోటలో ఉంటున్న రాజు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. ముందుగా దూదింపుడి రాజు చిత్రపటానికి పూలతో నివాళులర్పించి, జోహార్ కామ్రేడ్ దుదింపూడి రాజు, జోహార్ అంటూ నినాదాలు చేశారు.
సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ… రెక్కాడితేనే కానీ డొక్కాడని భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల బ్రతుకులకు భరోసా కరువైందని, కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి ఆదరణ కరువు అవుతుందని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సాధారణ మరణం సంభవిస్తే ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం సంక్షేమ బోర్డు ద్వారా అందేదని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఒక్క రూపాయి కూడా అందడం లేదన్నారు.
2009 నుండి 2019 వరకు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అందేవన్నారు. కానీ 2019లో వై.సీ.పీ. పాలనా ప్రభుత్వం రాగానే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాల సంక్షేమ నిధులను రాబందుల్లా తింటున్నారని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల కొరకు సెస్ రూపంలో వసూలు చేస్తున్న కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
