రాష్ట్రంలో 20 లక్షల జనాభా వరకు ఉన్న దేవాంగ సామాజికవర్గం పట్ల ప్రధాన రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని 50 శాతంకు పైగా చేనేతలు ఉన్న చీరాల శాసనసభ నియోజకవర్గంలో ఒక్క సీటైనా దేవాంగులకు కేటాయించాలని రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పుచ్చల రామకృష్ణ వైయస్సార్సీపి అధ్యక్షులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం నిమిత్తం విజయవాడ విచ్చేసిన పుచ్చల రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేస్తూ చీరాల స్థానాన్ని వై.సీ.పీ. నాయకుడు, రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్రబాబు, తెలుగుదేశంపార్టీ నాయకురాలు, మాజీ పొన్నూరు చైర్ పర్సన్, రెండు పర్యాయములు ఆమె కుటుంబం నుండి చీరాల శాసనసభ నియోజకవర్గానికి పనిచేసిన సజ్జా హేమలతలను కోరడం జరిగిందన్నారు.
అలాగే దేవాంగ నేత చందన నాగేశ్వర్ ను వై.ఎస్.ఆర్.సీ.పీ. రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి కో-ఆర్డినేటర్ గా నియమించి ఆయనకే ఎమ్మెల్యే సీటు ఇస్తామని ఊరించి ఇప్పుడు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు కట్టబెట్టడం సమంజసంగా లేదని అన్నారు. మరొకసారి దానిమీద పరిశీలన చేయాలని సీ.ఎం. జగన్మోహన్ రెడ్డిని పుచ్చల రామకృష్ణ కోరారు. వై.సి.పి., తెదేపా ఏ పార్టీ సీటు కేటాయించిన దేవాంగులు ఆ పార్టీకి రాష్ట్ర స్థాయిలో అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో పనిచేస్తామన్నారు. రాష్ట్రంలో 40 శాసనసభ స్థానాల్లో ప్రభావితం చేసే దేవాంగ సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూస్తే వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని పుచ్చల రామకృష్ణ హెచ్చరించారు.

