తడి చెత్త నుంచి కంప్రస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి కలిగిన సంస్థలు ముందుకు వస్తే ప్రభుత్వపరంగా తోడ్పాటు లభిస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు చెప్పారు. కేంద్రప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఈ అంశంపై కార్పొరేషన్ కార్యాలయంలో సంబంధిత ఏజన్సీలతో కమిషనర్ సమావేశమయ్యారు. కంప్రస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే సంస్థకు స్థలాన్ని సమకూర్చడంతోపాటు స్వచ్ఛభారత్ మిషన్ నుంచి ఆర్థిక తోడ్పాటు కూడా లభిస్తుందన్నారు. తడి చెత్త నుంచి సంపద తయారీలో భాగంగా 2023–24 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా సుమారు 500 ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు.
ఈ క్రమంలో ముందుకు వచ్చే సంస్థలకు అవసరమైన తడిచెత్తను నగరపాలక సంస్థ ద్వారా సమకూరుస్తామన్నారు. గో బర్థన్ పేరిట జరిగే ఈ ప్లాంట్ ఏర్పాటులో పేడతో పాటు, ఎండిన ఆకులు, కూరగాయల, వ్యవసాయ వ్యర్థాలు, ఇతర తడిచెత్తను కార్పొరేషన్ నుంచి సమకూరుస్తామన్నారు. చమురు, సహజ వాయువులను ఉత్పత్తి చేసే సంస్థల ప్రతినిధులతో ముందుకు వస్తే ప్రభుత్వంతో చర్చించి అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈ.ఈ. మాధవీ, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

