తూర్పు గోదావరి జిల్లాను మాదకద్రవ్యాలు వినియోగ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో సంబంధిత సమన్వయ శాఖ అధికారులు కృషి చేయాలని, ఎన్నికల నేపథ్యంలో మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉంటుందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత, ఎస్పీ పి. జగదీష్ అధ్యక్షతన జిల్లా స్థాయి జాతీయ ఔషధ డిమాండ్ తగ్గింపు ఎన్.సీ.ఓ.ఆర్.డీ. కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తి స్థాయిలో అరికట్టడం కోసం సమన్వయ శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో మరింత నిఘా పెట్టాలని తెలిపారు. ఇందులో భాగంగా గంజాయి, మాదక ద్రవ్యాలు పండించడం నుంచి వినియోగించడం వరకు ప్రతి ఒక్క ప్రాంతాన్ని గుర్తించి వాటి నియంత్రణ పద్ధతులు సమర్థవంతంగా అమలు చేయడం ముఖ్యం అన్నారు.

