తీర ప్రాంత మత్స్యకారుల జీవితాలను చిన్నాభిన్నం చేసే విధంగా బహుళ జాతి కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. ఆయా కంపెనీలు కార్యకలాపాలలో భాగంగా వెదజల్లే కాలుష్య వ్యర్ధాలు మూలంగా తీర ప్రాంత మత్స్యకారుల జీవన ప్రమాణాలు దెబ్బ తింటున్నాయి. దివిస్, అరబిందో ఫార్మా ఫ్యాక్టరీలు వేస్తున్న పైప్ లైన్ కారణంగా ఉప్పాడ అమీనాబాద్ మూలపేట గ్రామంలో సుమారు ఎనిమిది వేల మంది మత్స్యకారి కుటుంబాలకు నష్టం వాటిల్లి వేట లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఉప్పాడ గ్రామ సర్పంచ్ మేరీ జాన్ మాట్లాడుతూ… అరబిందో ఫార్మా కంపెనీ వేస్తున్న పైపు లైను ద్వారా ఆయా ఫ్యాక్టరీల నుండి వచ్చే వ్యర్ధాలను నేరుగా సముద్రంలోకి కలిపే విధంగా ఉన్నాయన్నారు. వాటిని తక్షణమే నియంత్రించకపోతే తీరప్రాంత మత్స్యకారులు జీవనాధారం లేక నడిరోడ్న పడాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అరబిందో, దివిస్ కంపెనీలు వేస్తున్న పైపులైను తక్షణం తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

