ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టి.డి.పి., బీ.జే.పీ. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు జనసేన నాయకులకి సూచించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, గోదావరి జిల్లాలకు సంబందించిన పలువురు నాయకులతో నాగబాబు భేటీ అయ్యారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పోటీకి అవసరమైన ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాల ప్రణాళికలు ముమ్మరం చేయాలని అన్నారు.
ప్రచారం కోసం రావాలని నాయకులు ఆయన్ని కోరారు. దానికి ఆయన స్పందిస్తూ… తప్పనిసరిగా పాల్గొంటానని చెప్పారు. జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాలతో పాటు పొత్తు ధర్మంలో భాగంగా భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లో కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన బాధ్యత మనపై ఉన్నదని అన్నారు. పొత్తులో భాగంగా పలువురు నాయకులకు సీట్లు సర్దుబాటు చేయలేకపోయారని… విశాల దృక్పథంతో ఆలోచన చేసి కూటమి విజయంలో భాగస్వాములు కావాలని కోరారు.
