జగనన్నకు చెబుదాం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో అర్జీదారుల సంతృప్తి పడేలా పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని గోదావరి భవన్ నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జగనన్నకు చెబుదాం… స్పందన కార్యక్రమాలను జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు హిమాన్షు శుక్లా, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్, జిల్లా రెవెన్యూ అధికారి సి.హెచ్. సత్తిబాబులతో కలిసి అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కారించాలని స్థానికంగా ఉన్న ఆయా శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు.
అదేవిధంగా మండల స్థాయి నుంచి వచ్చిన సమస్యలను సంబంధిత తాసిల్దార్లు, ఎం.పీ.డీ.వో. లతో వర్చువల్ విధానంలో సంప్రదించి అర్జీదారులకు తగు పరిష్కార మార్గాలు చూపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధిం చి మొత్తం 260 అర్జీలు వచ్చాయని అన్నారు.

