కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో వై.సీ.పీ. ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందని సి.పి.ఐ. జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు. రాజమహేంద్రవరంలో స్థానిక సి.పి.ఐ. కార్యాలయములో పాత్రికేయల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కేంద్రంలో బి.జె.పి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో కుల మత ఘర్షణలు పెరిగిపోతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పుల్వామా ఘటన నుండి మణిపూర్ అల్లర్ల వరకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన టి.డి.పి., 2019లో అధికారంలోకి వచ్చిన వై.సీ.పీ. కూడా కేంద్రంలో బి.జె.పి. కి తొత్తులుగా మారాయని అన్నారు. రాష్ట్రానికి రావలసిన వాటాలు తీసుకురావడంలో ఇరు పార్టీలు విఫలమయ్యాయని తీవ్రంగా దుయ్యబట్టారు.
ఎన్నికలకు సిద్ధమంటూ ప్రకటనలు గుప్పిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధమయ్యారో స్పష్టం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఏ.పీ. కు నష్టం చేసిన మోడీ కు జగన్ , చంద్రబాబు, పవన్ జత కట్టడం దారుణం అన్నారు . రానున్న ఎన్నికలలో ఇండియా కూటమి ను గెలిపించాలని ఆమె ప్రజలుకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి వంగమూడి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్ప రమణ, సేపెని రమణమ్మ, శ్రీనివాస్ , టి .నాగేశ్వరావు , రామకృష్ణ , తదితరులు పాల్గొన్నారు.
