కాకినాడ జిల్లా కేంద్రం నుండి సైయంట్ సాప్ట్ వేర్ కంపెనీ విశాఖకు తరలిపోవడం ప్రగతికి తిరోగమనంగా వుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. 2007లో సాప్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రాలోని 4టైర్-1 నగరాల్లో ఒకటిగా గుర్తించిన కాకినాడ సర్పవరం ఏ.పి.పి.ఐ.సి. ఇంక్యుబేషన్ సెంటర్లోకి 2013లో సాప్ట్ వేర్ సంస్థ వచ్చింది.
కాని మౌలిక సదుపాయాలు కొరత, రోడ్లు, విద్యుత్ వంటి వసతులు లేక ప్రభుత్వ సహకారం అందక విసిగి ఆ సంస్థ విశాఖకు తరలిపోవడం కాకినాడ జిల్లా దౌర్భాగ్య మన్నారు. అప్పటి 12 కంపెనీల్లో సగం పైగా వెనక్కి పోయాయని కొండనాలుకకు మందు వేస్తే వున్న నాలుక ఊడినట్టుగా విభజిత ఆంధ్రాలో కాకినాడ అభివృద్ధి ఎంతగా నష్టపోతున్నదో స్పష్టం అవుతోందన్నారు.
సముద్ర తీరంలోని నాగార్జున ఫెర్టిలైజర్స్ సంస్థ లావాదేవీల మిషతో గ్రీనరీభూముల నుండి జింకల పార్కును శ్రీ శైలం టైగర్ రిజర్వ్ కు తరలించిన విషయం కోస్తా తీర పర్యాటక ప్రగతికి విఘాతం కలిగించే విషయమన్నారు. పాలకుల నిర్లక్ష్యం వలన కొత్తవి రాకపోయినా వున్నవి పోకుండా కాపాడే తీరు శూన్యం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేసారు.

