ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా ఈనెల 27న ముసాయిదా ఓటరు జాబితా ముద్రణ చేయడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కృతికా శుక్లా అన్నారు. కాకినాడ కలెక్టర్ లో జిల్లాలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, రెవెన్యూ, ఎన్నికల అధికారులతో కలిసి సమావేశయ్యారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 రూపకల్పనలో భాగంగా జిల్లాలో జరుగుతున్న కార్యకలాపాలు, ఈ.వీ.ఎం. ల తొలి దశ తనిఖీ వంటి అంశాలను కలెక్టర్, రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ… ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూలు ప్రకారం ఈ 27న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందన్నారు.
అదేవిధంగా 2024-జనవరి 5న తుది ఓటరు జాబితా ముద్రించనున్నట్లు ఆమె తెలిపారు. తొలి దశ ఈవీఎం తనిఖీ ప్రక్రియ ఈ నెల 16 నుంచి కాకినాడ అంబేద్కర్ భవన్ లో ప్రారంభమైయిందని ఇప్పటివరకు 50 శాతం ఈవీఎంల తనిఖీ పూర్తయిందన్నారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు పర్యవేక్షణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు మధ్య ఈ తనిఖీ ప్రక్రియ అంతా సవ్యంగా సాగుతుందని, నవంబర్ 10 నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీధర్ రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు రావూరి వెంకటేశ్వరరావు (వైసీపీ), తదితరులు పాల్గొన్నారు.

