తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో విషాదం చోటుచేసుకుంది. కడియపుసావరంలో నివసిస్తున్న ఒక కుటుంబంలో భర్త అనుమానంతో భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే… కడియపుసావరంకు చెందిన దూళ్ల సూరిబాబు (40) అదే గ్రామానికి చెందిన సత్య శ్రీ (33) లు 16 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి వెంకన్న బాబు, వైష్ణవి అనే అమ్మాయి ఉంది.
ఆ కుటుంబం అంతా సజావుగా సాగిపోతుందనుకునే సమయంలో సూరిబాబుకు భార్యపై అనుమానం వచ్చింది. ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందని గొడవలు పెట్టేవాడు. పలుసార్లు పెద్దలు ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సూరిబాబు మనసులో పాతుకుపోయిన అనుమానం అతడిని హంతకుడు గా మార్చింది. గురువారం ఉదయం అత్తవారింట్లో ఉన్న భార్య, పిల్లల్లో పిల్లలిద్దరనీ తన ఇంటికి తీసుకొచ్చి, అనంతరం భార్య దగ్గరికి వెళ్లి మొక్కలు గ్రాఫ్టింగ్ చేసే బ్లేడ్ తో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు.
సంఘటనా స్థలానికి దక్షిణ మండల డిఎస్పి అంబికా ప్రసాద్, సి.ఐ. తులసి ధర్ లు వచ్చి విచారణ చేపట్టారు. భర్తే హత్య చేసాడని నిర్ధారించుకుని అతను కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఇంతలో సూరిబాబు పురుగుమందు సేవించాడని వార్త వచ్చింది. పరుగున బంధుమిత్రులు అతన్ని తీసుకుని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు తెలిపారు.

