జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామ శివారులో ఉన్న సింగరమ్మ అమ్మవారి దేవస్థానం ఉత్సవాలలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధుడు, అల్లూరి సీతారామరాజు చరిత్ర పరిశోధకులు పడాల రామారావు రచించిన అల్లూరి సీతారామరాజు నాటకాన్ని ప్రదర్శించారు. ఈ సభకు దేవస్థానం కమిటీ చైర్మన్ తొట్టిపూడి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశం కోసం ప్రాణాలర్పించిన తెలుగు తల్లి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు నాటకాన్ని ప్రదర్శించడం చాలా సంతోషకరమన్నారు. ఆ నాటక రచయిత పడాల రామారావు తనయుడు జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు ముఖ్యఅతిథిగా పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
ఈ సందర్భంగా పడాల వీరభద్రరావు మాట్లాడుతూ తెలుగుజాతి పౌరుష ప్రతాపాలను ప్రపంచానికి చాటిన విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు అని, ఆయన నాటక ప్రదర్శనకు సింగరమ్మ అమ్మవారి దేవస్థానం కమిటీ అవకాశం కల్పించడం అభినందనీయమని అన్నారు. అల్లూరి, భగత్ సింగ్ వంటి స్వాతంత్ర్య సమరయోధులను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అల్లూరి పాత్ర పోషించిన గోపు రాంబాబును పడాల అభినందించారు. నాాటకంలో అన్ని పాత్రలు పోటాపోటీగా నటించారు. నేపధ్య గాయకులు, సంగీతం చక్కగా సమకూర్చారు.
